రాష్ట్రంలో 10వ తరగతికి సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మెనూ రూపొందించారు రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సర్కారు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది.

తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు (మిల్లెట్ బిస్కెట్లు), పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. అందుకోసం, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు బదిలీ చేయనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనుండగా… ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ లో స్నాక్స్ అందించనున్నారు.