భారత రాజకీయ వ్యవస్థల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవు : రాహుల్‌ గాంధీ

There is no love, respect and humility in Indian political system: Rahul Gandhi

అమెరికా : భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రస్తుతం రాహుల్‌ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెక్సాస్‌ లోని ఇండియన్‌ అమెరికన్‌ కమ్మూనిటీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

భారత్‌ అంటే ఒకే ఆలోచన అని ఆర్‌ఎస్‌ఎస్‌ మ్ముతోందని వ్యాఖ్యానించారు. కానీ, భారత్‌ అంటే బహుళ ఆలోచనలు అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అగ్రరాజ్యం అమెరికాలో లానే అందరికీ ప్రాతినిథ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా రాహుల్‌ తెలిపారు. కులం, మతం, భాష, సంప్రదాయం, చరిత్రతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలు కనేందుకు అర్హులే అని అన్నారు. కానీ, భారత్‌లో ఇప్పుడు ఆ పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తోందని తెలిపారు. భారత ప్రధాన మంత్రి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైందని వ్యాఖ్యానించారు.

రాజకీయ నాయకులు కుల మతాలకు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలని ఈ సందర్భంగా రాహుల్‌ అన్నారు. కానీ భారత రాజకీయ వ్యవస్థలో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవన్నారు. ‘భారత రాజకీయ వ్యవస్థల్లో, పార్టీల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని నేను భావిస్తున్నాను. కులమతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి. అత్యంత శక్తివంతమైన వ్యక్తులను మాత్రమేకాదు, భారతదేశాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించాలి’ అని రాహుల్‌ పేర్కొన్నారు.