న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఆయన అగ్రరాజ్యానికి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. 13న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం అవుతారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం ముందు ఫ్రాన్స్‌కు వెళతారు. ఆ దేశ రాజధాని ప్యారిస్‌లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జరగనున్న ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’కు హాజరవుతారు. ఫ్రాన్స్ ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ నాయకులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, అకాడమిక్స్, సివిల్ సొసైటీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో జరుగుతున్న పరిణామాలు, వాటి నియంత్రణపై చర్చించనున్నారు.

మోడీ అమెరికా పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, రెండు దేశాల మధ్య ఉన్న ట్రేడ్, డిఫెన్స్, రీజినల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ట్రంప్, మోడీ చర్చించే అవకాశం ఉంది. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని కలిసిన అతికొద్ది మంది గ్లోబల్ లీడర్స్‌లో మోడీ ఒకరుగా నిలవనుండడం విశేషం. దీన్ని బట్టి అమెరికా భారత్‌తో సంబంధాలకు ఎంత విలువిస్తుందో అర్థమవుతోంది.