అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు. వారందరినీ కూడా చేతులకు బేడీలు వేసి, కాళ్లకు సంకెళ్లతో బంధించి ఏకంగా మిలిటరీ హెలికాప్టర్‌లో స్వదేశానికి పంపించడం పట్ల భారత్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. అమెరికాతో సుదీర్ఘకాలం పాటు అన్నిరంగాల్లోనూ స్నేహ సంబంధాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఏ మాత్రం ఉపేక్ష వహించకుండా అక్రమ వలసదారులను క్రిమినల్స్ తరహాలో ట్రీట్ చేయడం పట్ల అసహనం చెలరేగింది. ఇది రాజకీయ రచ్చకూ దారి తీసింది. అక్రమ వలసదారుల తరలింపు విధానం పట్ల ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వైఖరేంటో తెలియజేయాలంటూ పట్టుబట్టింది.

దీనిపై సమగ్ర చర్చ జరగాలంటూ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై చర్చించడానికి ఈ ఉదయమే కాంగ్రెస్ విప్ కేసీ వేణుగోపాల్.. వాయిదా తీర్మానాన్ని సైతం అందజేశారు. దీన్ని స్పీకర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఇండియా భాగస్వామ్య ఎంపీలందరూ మూకుమ్మడిగా లేచి నిల్చున్నారు. అక్రమ వసలదారులు, వారి తరలింపు విధానంపై అధికార ఎన్డీఏ తన వైఖరిని తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు. దీనితో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వారిని వారించడానికి స్పీకర్ ఓం బిర్లా, ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో సభను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తోటి భారతీయులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో తరలించడం దేశానికి అవమానకరంటూ కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు.