కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులతో బయలుదేరింది. ఈ నేప‌థ్యంలో చాపర్ బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు రాగానే హెలికాఫ్ట‌ర్ ఉదయం 6.45కు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. వెంట‌నే హెలికాప్టర్‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో హెలికాప్ట‌ర్‌లో ఉన్న పైలెట్‌తో సహా ముగ్గురు వ్యక్తులు ఆ మంట‌ల్లో చిక్కుకుని సజీవ దహన‌మ‌య్యారు. అయితే, ఈ ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, ఆ హెలికాఫ్ట‌ర్ ప్ర‌యివేట్‌దా లేక ప్ర‌భుత్వానిదా.? అని తెలియాల్సి ఉంది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న హింజేవాడి పోలీస్‌ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హయ్య థోరట్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆయన పూణే మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎంఆర్డీఏ)కి సమాచారం అందజేశారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో వారు స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.