దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కలవరపెడుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఉహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర లో ప్రస్తుతం 163 మందికి ఈ వైరస్ నిర్దారణ కాగా.. ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు ఉన్నాయి. తాజాగా, నాందేడ్‌లో జీబీఎస్ బారినపడి చికిత్స పొందూ 60ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. దీంతో మొత్తం జీబీఎస్ మరణాలు సంఖ్య 5కు చేరింది.మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘సోమవారం కొత్తగా ఐదుగురికి జీబీఎస్ నిర్దారణ అయ్యింది.. ఎటువంటి మరణం లేదు.. ఇప్పటి వరకూ 127 కేసులు నిర్దారణ అయ్యాయి.. అనుమానిత 163 కేసుల్లో పుణే నగరంలో 32, ఇటీవల పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగా చేరిన గ్రామాల్లో 86, పింప్రి చించువాడలో 18, పుణే గ్రామీణ జిల్లాలో 19, ఇతర జిల్లాల్లో 8 మంది ఉన్నారు’ అని తెలిపారు. జీబీఎస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకూ 47 మంది కోలుకున్నారని చెప్పారు. మరో 47 మంది ఐసీయూలోనూ.. 21 మంది వెంటలేటర్‌పైన చికిత్స పొందుతున్నట్టు వివరించారు.

బ్యాక్టీరియా లేదా కలుషిత ఆహారంద్వారా ఈ సిండ్రోమ్ వ్యాప్తిచెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు జీబీఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఇది కరోనా లాగా అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి ఒకరికి సోకదని, అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే చాలని అంటున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి.. పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు .