డొనాల్డ్‌ ట్రంప్‌ ను చంపేందుకు నిందితుడు భారీ స్కెచ్‌తో వచ్చాడు

ఆదివారం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియా రాష్ట్రంలోఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్టేజ్ మీద నుంచి కిందికి తీసుకొచ్చి అంబులెన్స్‌లోకి చేర్చారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. అతడు ట్రంప్ ర్యాలీ జరిగిన ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలోని బేథల్ పార్క్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని ఎఫ్‌బీఐ చెప్పింది. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని దర్యాప్తు సంస్థ తెలిపింది.

ఇక డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నానికి యత్నించిన నిందితుడు భారీ స్కెచ్‌ తో వచ్చినట్లు సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడి కారులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికన్ మీడియా నివేదించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్, సీఎన్ఎస్ షూటర్ కారులో పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు నివేదించాయి. అయితే, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అధికార డెమొక్రటిక్ పార్టీ, అధ్యక్షుడు జో బైడెన్‌ పై రిపబ్లికన్ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికలు జరగనున్న ఏడాదిలో ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను అందరూ ఖండించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.