రాఖీ పండగ వేళ టీజీఎస్‌ఆర్టీసీ రికార్డులు..

tsrtc-md-sajjanar

హైదరాబాద్‌: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. రాఖీ పండుగ ఆపరేషన్స్‌లో సిబ్బంది పనితీరు, అనుభవాలతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్బుతంగా పనిచేశారని కొనియాడారు. భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదిల్లో రికార్డుస్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేరవేసిందని తెలిపారు. వరుసగా మూడు రోజులు సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో నమోదైందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ ఒక్క రోజే 63 లక్షల మంది తమ బస్సుల్లో రాకపోకలు సాగించారని గుర్తు చేశారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు తిరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీ పౌర్ణమి నాడు 21 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో నమోదు చేయగా.. ఈ సారి 97 డిపోలు ఆ మైలురాయిని దాటాయని తెలిపారు. ఈ రాఖీ పండుగ టీజీఎస్ఆర్టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసిందని తెలిపారు.

కాగా, 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆర్టీసీకి రూ. 32 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని చెప్పింది. ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడూ రాలేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.