జులై రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జులై రెండో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను జులై రెండు/మూడో వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారని సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రంతో పాటు రాష్ట్రాలు పూర్తిస్థాయి బడ్జెట్‌కు బదులు దీనికే ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ పద్దులకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జులై వరకే ఇది అమల్లో ఉంటుంది.

ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్‌ అమల్లోకి రావాల్సి ఉంది. దీంతో కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ ఈ నెలలో పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి పద్దును ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకు ఉంటాయో చూసుకుని, వాటి ఆధారంగా ఇక్కడ తెలంగాణ సర్కార్ పూర్తిస్థాయి పద్దుకు తుది మెరుగులు దిద్దనుంది.

రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పథకాల అమలుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగనుంది. రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి ఎంత ఖర్చు అవుతుంది? దానికి నిధుల సమీకరణ ఎలా చేయాలనే అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.