భారతీయ మార్కెట్లో ఎంటర్ అయ్యేందుకు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న టెస్లాకు పన్నుల మోత రూపంలో ఆటంకాలు ఎదురయ్యేవి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అమెరికా నుంచి ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేస్తున్న టెస్లాకు భారత మార్కెట్లో ఎంటరయ్యేందుకు ఇవే సమస్యగా మారాయి. విదేశీ కార్లు భారత్ లో దిగుమతి చేసుకుంటే ఏకంగా 110 శాతం పన్ను ఉండేది. కానీ తాజాగా ప్రధాని మోడీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జరిపిన చర్చలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు వీరికి లైన్ క్లియర్ చేసింది.
ఉద్యోగాల నియామకం కోసం ప్రకటన
ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అయిన టెస్లా.. కస్టమర్-ఫేసింగ్, బ్యాక్-ఎండ్ ఉద్యోగాలతో సహా మొత్తం 13 ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమించుకునేందుకు ప్రకటన ఇచ్చింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, వివిధ సలహాదారులతో సహా కనీసం ఐదు స్థానాలు ముంబై, ఢిల్లీ యూనిట్స్ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి మిగిలిన ఓపెనింగ్స్ మాత్రం ముంబైలోనే చేస్తున్నారు. త్వరలో మరికొన్ని ఉద్యోగాలకూ ప్రకటనలు విడుదల చేసేందుకు టెస్లా సిద్దమవుతోంది.
భాగస్వాములైన దేశాలకు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు కాగానే డొనాల్డ్ ట్రంప్ తమ ఎగుమతులపై వివిధ దేశాలు విధిస్తున్న పన్నులపై కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. అందులోనూ తమ వాణిజ్య భాగస్వాములైన దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. తమ ఉత్పత్తులపై ఎంత పన్ను విధిస్తే తానూ అంతే పన్ను విధిస్తానంటూ హెచ్చరించారు. అదే సమయంలో ట్రంప్ కు ఇప్పుడు సన్నిహితుడిగా మారిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం ప్రధాని మోడీని అమెరికా టూర్ లో భేటీ అయి కీలక చర్చలు జరిపారు.
భారత్ లోనే కార్లు ఉత్పత్తి
ఈ రెండు పరిణామాలు భారత్ లో టెస్లా కార్ల ఎంట్రీకి మార్గం సుగమం చేశాయి. ఇన్నాళ్లూ విదేశీ కార్ల దిగుమతిపై 110 శాతం పన్ను విధిస్తున్న కేంద్రం.. దాన్ని కాస్త ఏకంగా 70 శాతానికి తగ్గించేసింది. దీంతో టెస్లాకు కూడా భారత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. తాజా పరిణామాలతో భారత్ లోనే కార్లు ఉత్పత్తి చేయాలంటూ మస్క్ కు షరతులు పెట్టిన మోడీ సర్కార్ ఇప్పుడు గొంతు సవరించుకుని దిగుమతులకైనా ఓకే చెప్పేసింది. ఇదే అదనుగా మస్క్ భారత్ లో ఉద్యోగుల నియామకాలను ప్రారంభించేశారు.
