దిలుసుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి

దిలుసుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మరణించాడు. చర్లపల్లిలో జైలులో ఉన్న సయ్యద్ అనారోగ్య కారణాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

ప్రస్తుతం చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సయ్యద్​ గత కిన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల రోజుల క్రితం ఈ ఉగ్రవాదికి గుండె ఆపరేషన్​ జరిగింది. ఆతర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజుల క్రితం పల్స్​ పడిపోవడంతో జైలు అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టెర్రరిస్ట్​ సయ్యద్​ గురువారం తెల్లవారుజామున మరణించాడు. ఉగ్రసంస్థ ఇండియన్​ ముజాహిదీన్​ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి అత్యంత సన్నిహితుడిగా సయ్యద్​ మఖ్బూల్.

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ డిపో ఎదురుగా 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు చోట్ల మూడు పేలుళ్లు సంభవించాయి.సైకిల్ మీద అమర్చిన బాంబులను కోణార్క్ థియేటర్, వెంకటాద్రి థియేటర్ మధ్యలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో భయాందోళనకు గురిచేసింది. సయ్యద్ మక్బూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడని ఆయనను 2013 ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, భారత్ లోని ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులతో అతడు క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతూ కుట్రలో భాగమైనట్లు ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. దీంతో ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.

మక్బూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా..ఇటీవల గుండె ఆపరేషన్ జరిగింది. అయితే తర్వాత మూత్రపిండాలు సైతం విఫలమై ఆరోగ్యం క్షీణించింది. దీంతో నిందితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.