హైదరాబాద్: హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు చెప్పేందుకే సచివాలయానికి వెళ్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. తక్షణమే జీవో 29ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులను ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.