కేదార్నాథ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు..

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఈరోజు ఉ.6 గంటలకు హెలికాప్టర్ రావాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 2 రోజులు అక్కడే ఉండాల్సి రావొచ్చని అధికారులు తెలిపారు.

స‌ద‌ర‌న్ ట్రావెల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 18 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ దర్శనానికి బ‌య‌లుదేరారు. అక్క‌డ ద‌ర్శ‌నం ముగించుకున్న త‌ర్వాత 14 మంది బద్రీనాథ్ వెళ్లేందుకు బ‌లుదేరి వెళ్లారు. అయితే, భారీ వర్షాల కార‌ణంగా కేదార్‌నాథ్‌- బద్రీనాథ్‌ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వ‌ర్షాల‌కు తీవ్ర‌మైన చ‌లిగాలులు తోడ‌వ్వ‌డంతో ఆ మార్గంలో చిక్కుకున్న యాత్రికులు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. యాత్రికుల‌లో నిజామాబాద్‌, విజయనగరంకు చెందిన వారు ఉన్నారు. అక్క‌డివారి ప‌రిస్థితిని తెలుసుకున్న విజ‌య‌న‌గ‌రం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాల‌ని, అధికారుల‌తో మాట్లాడి క్షేమంగా తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇదే క్రమంలో అందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకుని, దగ్గరుండి పర్యవేక్షిస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.