ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానం..?

ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానమే అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుండగా, దరఖాస్తులకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు విధించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం విధానాలపై కమిటీ అధ్యయనం చేసింది. వచ్చే నెలలో మద్యం విధానం ఖరారుతో పాటు దరఖాస్తులు స్వీకరించి లైసెన్సులు అందజేసే అవకాశముంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానంపై కమిటీ సమీక్షించనుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. వివిధ వర్గాల అభిప్రాయాలు సైతం సేకరించనుంది. ఇప్పటికే అధికారులు ఇచ్చిన నివేదికను సబ్‌కమిటీ పరిశీలించనుంది. గత వైసీపీ పాలనలో జే బ్రాండ్‌ (J Brand) పేరిట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను జరిపిందని, కల్తీ మద్యంను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి సభ్యులు విస్తృతంగా ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం నూతన మద్యం పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం మరోమారు మంత్రులతో ఏర్పాటుచేసిన సబ్‌కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది విధానాన్ని ప్రకటించే అవకాశముంది.