ప్రమాదంలో తెలంగాణ సచివాలయం
తెలంగాణ సచివాలయ భవన నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా సచివాలయ ఐదో అంతస్తు నుంచి పెచ్చులు ఊడి పడిన ఘటన కలకలం రేపింది. పెచ్చులు ఒక్కసారిగా భారీ శబ్దంతో కిందపడటంతో భద్రతా పరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ఉన్న అంతస్తులో పెచ్చులు స్వల్పంగా ఊడిపోయాయి. ముఖ్యంగా ఐదో అంతస్తు మెయిన్ ఎంట్రన్స్ వద్ద పెచ్చులు కూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పెచ్చులు పడ్డాయి, అయితే కారులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం జరగలేదు. సచివాలయ నిర్మాణంలో లోపాల గురించి గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. రూ.1200 కోట్లతో నిర్మించిన ఈ భవనం నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం సచివాలయ నిర్మాణానికి భారీ ఖర్చుపై ప్రశ్నించారు. ఇప్పుడు అదే భవనంలో తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరగడం చర్చనీయాంశమైంది. ఇటీవల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా సచివాలయం నిర్మాణంలో లోపాలున్నాయని పేర్కొన్నారు. తన ఛాంబర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఇవన్నీ నిన్నటి వరకూ అంతర్గత విషయాలుగా మాత్రమే మిగిలిపోయాయి, కానీ ఇప్పుడు భవనం నుంచి పెచ్చులు ఊడి పడటంతో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.