తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం: సీఎం రేవంత్ రెడ్డి

Telangana means sacrifice and martyrdom: CM Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా అక్షర యోధులు ఒకవైపు, సాయుధ యోధులు మరోవైపు పోరాడి నిరంకుశ రాచరికాన్ని, హైదరాబాద్ రాజును ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948, సెప్టెంబర్ 17 ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అయితే ఈ పోరాటం ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగమని, నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, నిస్వార్థంగా తమ జీవితాలను పణంగా పెట్టి సర్వం కోల్పోయినా వెనుకంజ వేయని ఆ మహనీయుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఆ నాటి అమరవీరులకు ఘన నివాళి అర్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ శుభ దిన్నాన్ని ప్రజాపాలనా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించనుందని పేర్కొన్నారు.