తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్‌ వాయిదా

Telangana Group-2 Exam postponed

హైద‌రాబాద్ : నిరుద్యోగుల ఉద్య‌మానికి రేవంత్ స‌ర్కార్ త‌ల‌వంచింది. ఎట్ట‌కేల‌కు గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వ‌హించాల్సిన గ్రూప్-2 రాత‌ప‌రీక్ష‌ను డిసెంబ‌ర్‌కు వాయిదా వేస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న గ్రూప్-2 రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

గ్రూప్-2 వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాల‌ని గ‌త నెల రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాల‌యాన్ని ముట్ట‌డించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివ‌ర్సిటీ, అశోక్‌న‌గ‌ర్, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగులు ప‌లు ర‌కాలుగా నిర‌స‌నలు వ్య‌క్తం చేశారు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న నిరుద్యోగుల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపి లాఠీలు ఝుళిపించారు.

ఇటీవ‌లే అశోక్‌న‌గ‌ర్‌లో అర్థ‌రాత్రి వేళ భారీ నిర‌స‌న చేప‌ట్టి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దించారు. తెలంగాణ స‌చివాల‌యం ముట్ట‌డికి కూడా నిరుద్యోగులు పిలుపునివ్వ‌డంతో.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. మొత్తానికి నిరుద్యోగుల ఉద్య‌మం ఫ‌లించింది.