నూతన MSME పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(MSME) నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిని తయారు చేసే క్రమంలో రాష్ట్ర జీడీపీ, ఉపాధి కల్పన, ఎగుమతులు, కొత్త ఆవిష్కరణలు వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈ ప్రదర్శనను విశ్లేషించి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మాదాపూర్‌ శిల్పకళా వేదికగా ఎంఎస్‌ఎం పాలసీని సిఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితోపాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సిఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని తెలంగాణ సర్కార్‌ ఆలోచిస్తోంది. పారిశ్రామికరంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో, సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘పరిశ్రమ 4.0’ పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ నూతన విధానం దోహదపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.