‘భారతీయుడు-2′ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

కమల్ హాసన్- శంకర్ కాంబోలో ఈనెల 12న రిలీజ్ కానున్న ‘భారతీయుడు-2’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు బెన్ఫిట్ షోకు కూడా అనుమతి ఇచ్చి అభిమానులకు ఇటు చిత్రయూనిట్ కు సంతోషం నింపింది. 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కాజ‌ల్ అగ‌ర్వాల్, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాబీ సింహా, స‌ముద్ర ఖ‌ని లు కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ టీమ్‌కి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదండోయ్ స్పెష‌ల్ షోలు వేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పించింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్ర్కీన్స్‌లో రూ.50, మ‌ల్టీప్లెక్స్‌ల్లో రూ.75 చొప్పున టికెట్ పై ఏడు రోజుల పాటు పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఇటీవల తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్‌ నియంత్రణ కోసం అవగాహన కల్పించేలా వీడియోను త‌యారు చేసి ఇవ్వాల‌ని సినీ ప‌రిశ్ర‌మ‌ను కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లు యాంటీ డ్ర‌గ్స్ పై ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్ర‌మంలోనే టికెట్ల ధ‌ర‌ల‌ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లుగా తెలుస్తోంది.