తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. కులాలు వేరు కావడం వల్ల ప్రేమను అంగీకరించని తండ్రి, కూతురి ప్రియుడిపై పెత్తనం చెలాయించి అతని ప్రాణం తీశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో సంచలనంగా మారింది.

ప్రేమను అంగీకరించని తండ్రి.. దారుణానికి పాల్పడిన ఘటన
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చాడు. వీరిద్దరూ కులాలు వేరు కావడంతో యువతి తండ్రి ఈ సంబంధాన్ని వ్యతిరేకించాడు. సాయికుమార్ తన కూతురితో ఇకపై మాట్లాడకూడదని స్పష్టం చేసాడు. అయినప్పటికీ ప్రేమికులు తమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తండ్రి పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా యువతి సాయికుమార్‌ను కంటిన్యూగా కలుస్తూ ఉండడంతో, ఈ వ్యవహారాన్ని ఏకంగా ముగించాలని యువతి తండ్రి నిర్ణయించుకున్నాడు. అంతే కాదు, ప్రియుడిని హత్య చేసేందుకు పథకం రచించి దాన్ని అమలు చేశాడు.
గ్రామంలో విషాద ఛాయలు
గురువారం రాత్రి పది గంటల సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సాయికుమార్ తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటుండగా, యువతి తండ్రి అక్కడికి గొడ్డలితో దూసుకువచ్చాడు. ఒక్కసారిగా సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యం అందిస్తున్నప్పటికీ గాయాలు తీవ్రత ఎక్కువ కావడంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్య మరింత విషాదాన్ని రేపిన అంశం ఏమిటంటే, సాయికుమార్ పుట్టినరోజు నాడే ప్రాణాలు విడిచాడు. యువకుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పుట్టినరోజును జరుపుకోవాల్సిన రోజు ఓ తండ్రి క్రూరత్వానికి బలైపోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో ముప్పిరి తోట గ్రామం విషాదంలో మునిగిపోయింది. యువకుడి మృతితో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆసుపత్రిలో డెడ్‌బాడీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య ఘటన ప్రేమ పెళ్లిపై సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడుతున్న తీరుకు మరో ఉదాహరణగా మారింది. కులం, పరువు కోసం ప్రాణాలు తీసే ఈ తప్పుడు ఆలోచనలకు ఎప్పుడు తెరపడుతుందో అన్నదే ప్రశ్నగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.