తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ అనే సంస్థ జారీ చేసిన హెచ్చరికలు ప్రజల్లో గణనీయమైన ఆందోళన కలిగించింది. సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, రామగుండం సమీప భూభాగాల్లో భారీగా భూకంప ఉత్పత్తికి అనుకూలమైన భౌగోళిక సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రకంపనల ప్రభావం హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు విస్తరించే అవకాశం ఉందని సంస్థ హెచ్చరిస్తోంది.
ప్రభుత్వ, శాస్త్రీయ సంస్థల స్పందన
ఈ హెచ్చరికలపై అధికారికంగా ఏ ప్రభుత్వ సంస్థ కానీ, భారత వాతావరణ శాఖ (IMD), భూగర్భ పరిశోధనా సంస్థలు కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. IMD ప్రతినిధుల ప్రకారం, భూకంపాలను ఖచ్చితంగా ముందే అంచనా వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యపడదు. అందుకే, ఈ రకమైన సమాచారం గల ప్రకటనలను అప్రమత్తంగా, శాస్త్రీయ ప్రమాణాలతో పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
భూకంప హెచ్చరికలపై నిపుణుల అభిప్రాయాలు
భూకంపాలపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు మరియు భూభౌగోళిక నిపుణులు ఏకగ్రీవంగా చెబుతున్న విషయం ఏంటంటే – భూకంపాలు కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ వస్తాయో అంచనా వేయడం చాలా క్లిష్టమైన పని. సాధారణంగా భూమి లోపల జరిగే ఘర్షణలు, టెక్టానిక్ ప్లేట్ల కదలికల వలన భూకంపాలు సంభవిస్తాయని మనకు తెలుసు. అయితే, ఇవి ఎప్పుడూ ఒకే విధంగా పనిచేయవు, వాటి ప్రభావం బహుళ మార్పులతో కూడుకున్నదిగా ఉంటుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భాగాలు ప్రధానంగా జోన్ 2, 3లోకి వస్తాయి. అంటే ఇవి తక్కువ నుంచి ఓ మోస్తరు భూకంప తీవ్రతకు గురయ్యే ప్రాంతాలుగా పరిగణించబడతాయి. అత్యధికంగా 5.0 తీవ్రతకు మించి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో సంభవించిన భూకంపాలు 1969లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1998లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో భూంకంపం వచ్చింది. 1984, 1999, 2013లలో హైదరాబాద్‌లో చిన్నచిన్న భూకంపాలు సంభవించాయి. భూకంపాల రాకను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని, కాబట్టి భయం అవసరం లేదని అంటున్నారు. అయితే, అప్రమత్తంగా మాత్రం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read also: Government Schools : గవర్నమెంట్ స్కూళ్లలో ప్రీ స్కూల్ ఆలోచన – సీఎం రేవంత్