తెలంగాణ బడ్జెట్ శాఖల వారీగా నిధులు..

తెలంగాణ అసెంబ్లీలో 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ.3050 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,71,757కోట్ల అప్పు చేసిందని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్ర రుణం పది రెట్లు పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం రూ.42,892 కోట్లు చెల్లించిందని తెలిపారు. బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తమ పార్టీ ఇచ్చిన హామీల్లో రైతులకు పంట రుణాల మాఫీ అత్యంత సాహసోపేతమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అన్నారు. తమ అధినేత రాహుల్ గాంధీ ఎంతో సాహసం చేసి వరంగల్ సభలో రుణమాఫీ ప్రకటించారన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిధులను ఎలాగైనా సమకూర్చాలనే సంకల్ప బలం తమకు మొదటి నుంచి ఉందని ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్ శాఖల వారీగా నిధులు చూస్తే..

  • వ్యవసాయ శాఖ – రూ.72,659 కోట్లు
  • సంక్షేమం – రూ.40,000 కోట్లు
  • సాగునీరు – రూ.26,000 కోట్లు
  • గృహ జ్యోతి – రూ.2,148 కోట్లు
  • పశుసంవర్థక – రూ. 1,980 కోట్లు
  • హైదరాబాద్ నగర అభివృద్ధికి – రూ. 10వేల కోట్లు
  • రూ.500 గ్యాస్ సిలిండర్ – రూ.723కోట్లు
  • ప్రజా పంపిణీ – రూ.3,836 కోట్లు
  • ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ – రూ.100కోట్లు