వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చియి
హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024(అట్లాస్) పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి అక్షరసాక్ష్యంగా నిలిచింది. వివిధ రంగాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొందుపరుస్తూ రూపొందించిన ఈ నివేదిక బీఆర్‌ఎస్ హయాంలో సాధించిన రాష్ట్ర పురోగతికి అద్దం పట్టింది. కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళం వేసింది. వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చిచెప్పాయి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్(అట్లాస్) పుస్తకాన్ని డాక్టర్ బీఆర్ అంబేదర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆవిషరించారు.
అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్దున లేస్తే బీఆర్‌ఎస్ పాలనను రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్ సర్కారే ఈ విషయాలను వెల్లడించింది. కేసీఆర్ అమలు చేసిన పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని పెంచిందని కాంగ్రెస్ సర్కారు ఈ నివేదికలో పేర్కొన్నది.

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయం
తెలంగాణ ఏర్పాటు తరువాత దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం దేశీయ స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో ప్రతిఏటా వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.15, 01,981కోట్లతో 14.5 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. జీఎస్‌డీపీ వృద్ధిలో నాన్ స్పెషల్ క్యాటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్-1గా నిలిచినట్టు పేర్కొన్నది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరిగిందని, దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ అధికంగా, వేగంగా వృద్ధిని నమోదు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్టు వెల్లడైంది.
గణాంక నివేదిక
2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్‌డీపీ2023-24లో 196.9 శాతం వృద్ధితో రూ. 15,01,981 కోట్లుగా నమోదైంది.అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి మాత్రం 136.89 శాతంగానే ఉన్నది. 2023-24లో దేశ తలసరి ఆదాయం రూ.1,84,205 ఉండగా, తెలంగాణలో రూ. 3,56,564తో నాన్ స్పెషల్ క్యాటగిరీ(ఎన్‌ఎస్‌సీ) రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది. 2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68.17లక్షల టన్నులు ఉండగా, 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.