మరికాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం అనంతరం కంటోన్మెంట్‌ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలపనున్నది. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగనున్నది. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24 బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా చర్చిస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆర్వోఆర్‌ కొత్త చట్టం తీసుకురానున్నారని సమాచారం. సమావేశాలకు పోలీసులు నాలుగు అంచెల కంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 25న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

అదే రోజు ఉదయం 9గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో క్యాబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నది. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2 లేదా 3వ తేదీతో ముగించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజున ఆనవాయితీ ప్రకారం 26న సెలవు ఇవ్వనున్నారు. ఆదివారం నగరంలో బోనాలు ఉండటంతో ఆ రోజు కూడా సెలవు ఇవ్వనున్నారని సమాచారం. ఈనెలాఖరు కల్లా బడ్జెట్‌ను ఉభయ సభలు ఆమోదించి గవర్నర్‌ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటె అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ లోపలికి వెళ్లే దగ్గర రెండు రకాల కంచెలను ఏర్పాటు చేశారు.