తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తీన్మార్ మల్లన్న (నవీన్ కుమార్) పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలకు సిద్ధమైంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా బీసీ కులగణన, ఇతర సామాజిక అంశాలపై మల్లన్న చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవడం అనివార్యమని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు అందించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తీన్మార్ మల్లన్న భవిష్యత్తు ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనపై తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన కోసం అందరూ వేచిచూస్తున్నారు.