భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు.
కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవకుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాటా మరణం దేశానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని, అలాంటి గొప్ప వ్యక్తిని మరల చూడలేమని కామెంట్లు చేస్తున్నారు. రతనీ అసలైన ‘భారతరత్న’మని కొనియాడుతున్నారు. రతన్ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ. లక్ష కోట్లకు చేర్చారు.