‘అమిత్ షా వార్నింగ్’ ఫై మాజీ గవర్నర్ తమిళిసై వివరణ

చంద్రబాబు ప్రమాణ స్వీకర కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా , నడ్డా సహా అనేక రాష్ట్రాల రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. అలాగే మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా..తమిళసై కి హెచ్చరిక జారీ చేసారని ఓ వార్త తెగ వైరల్ కావడం తో వీరిపై తమిళిసై క్లారిటీ ఇచ్చింది.

చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను ఆమె తమిళిసై ఖండించారు. అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన తనకు భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని వివరణ ఇచ్చారు. ‘‘2024 ఎన్నికల తరువాత నేను తొలిసారిగా హోం మంత్రి అమిత్ షా ను కలిశాను. ఈ సందర్భంగా ఆయన నన్ను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారు. నేను మరింత విపులంగా చెప్పేందుకు ప్రయత్నించాను. అయితే, ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారు. ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ వివరణ’’ అని ఆమె ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.