కడప జిల్లా మైదుకూరులో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మైదుకూరులో కొత్త చరిత్రకు నాంది పలుకుతూ, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.
సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉంటాయో గతంలో తాను చూశానని, మహిళలు వంటచేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఆయన గుర్తు చేశారు. దీపం కార్యక్రమం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇప్పుడు దీపం-2 కింద మరింత సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.
చెత్త కలెక్షన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. పొడి, తడి చెత్తను వేరు చేయడం ద్వారా ఆ చెత్తను ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. చెత్త నుండి బయోగ్యాస్, విద్యుత్తు వంటి ఉపయోగకరమైన వస్తువులను తయారుచేసే విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. స్వచ్ఛతలో మైండ్ కంట్రోల్ ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మంచిపరిణామాలకు దారితీస్తుందన్నారు. ప్రతి వ్యక్తి స్వచ్ఛతపై శ్రద్ధ చూపితేనే సమాజం మార్పు చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి పాఠశాలలో స్వచ్ఛత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతకు అంకితం చేయాలని సూచించారు.