ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

Supreme Court verdict on SC and ST classification is heartening

అమరావతి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం వద్ద సున్నిపెంటలో ఇవాళ సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏ, బీ, సీ, డీ కేటగిరీలు తీసుకువచ్చానని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని వెల్లడించారు. అందుకే 1996-97లో రామచందరరావు కమిషన్ వేసి, ఆర్థిక పరిస్థితులన్నీ అధ్యయనం చేసిన తర్వాత… ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా తానే విభజించానని చంద్రబాబు వెల్లడించారు.

ఆ తర్వాత కాలంలో వర్గీకరణ అంశం అనేక కోర్టులో విచారణకు వచ్చిందని, చివరికి సుప్రీంకోర్టులో నేడు ఏడుగురు జడ్జిల ధర్మాసనం వర్గీకరణ సబబేని ధృవీకరించిందని చంద్రబాబు వివరించారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులోనూ సామాజిక న్యాయం చేశామని చెప్పారు.