లిక్కర్ స్కామ్ కేసు..మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌

Supreme Court Grants Bail To Manish Sisodia

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. మరోవైపు..సుప్రీంకోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సిసోడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా, ఆగస్టు5- 6న విచారణ జరిపి సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సిసోడియా బెయిల్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి. సిసోడియా విచారణకు సహకరించడం లేదని, జాప్యం చేస్తున్నారని, అనవసరపు పత్రాలను తనిఖీ చేయాలని కోరుతున్నారని సుప్రీంకోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు తెలిపారు. సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును దర్యాప్తు సంస్థలు కోరాయి.

అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వాదనల్లో భాగంగా దర్యాప్తు సంస్థలు సుప్రీంకు తెలిపాయి. గతేడాది అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును సిసోడియా ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కొద్ది రోజుల క్రితమే విచారణ పూర్తైంది. ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ మనీశ్ సిసోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 6వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష పడాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్ట్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఇక సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరపు లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై నేడు తీర్పు వెలువడనుంది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియా తీహార్ జైలు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే.. గత ఏడాది మార్చి 9న ఈడీ ఆయనను అదుపులోకి తీసుకున్నది. దీంతో సిసోడియా 14 నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.