కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court granted bail to Kejriwal
Supreme Court granted bail to Kejriwal

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ జైలు నుంచి విడుదలకానున్నారు. మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేయగా.. గతంలో ఈడీ కేసులో బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది.

జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సీబీఐ కేజ్రీవాల్‌ని అరెస్టు చేయడాన్ని ఇన్సురెన్స్‌ అరెస్టుగా పేర్కొన్నారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. మద్యం పాలసీ కేసులోని సొత్తును 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ వేయడంపై సైతం అభ్యంతరం తెలిపారు. బెయిల్ కోసం ముఖ్యమంత్రి ఎప్పుడూ ట్రయల్ కోర్టును ఆశ్రయించలేదన్నారు.