న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సుబ్రమణ్య స్వామి కోర్టుకు స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. ఇక వైవీ సుబ్బారెడ్డి తరఫున కిపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయితే, అందులో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం లడ్డూ కల్తీపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఒకరు ఇదే వివాదంపై మాట్లాడారని కొర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. ఈ విషయంలో తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తోనే దర్యాప్తు చేయించాలనుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు.