Sunrisers Hyderabad : రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్ న్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2025లో శుభారంభం చేసింది రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో SRH 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారీ స్కోర్లతో సాగే ఈ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. SRH జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయగా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు రాబట్టింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (106 నాటౌట్) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, ట్రావిస్ హెడ్ (67), హెన్రిచ్ క్లాసెన్ (34), నితీష్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేయగలిగింది.287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది.50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినా, సారథి సంజు శాంసన్ (66), ధ్రువ్ జురెల్ (70) మెరుపు ప్రదర్శన చేశారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి SRH పై ఒత్తిడి పెంచారు.శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో మెరిసాడు, ఇక జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో అలరించాడు.శాంసన్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా, జురెల్‌ను ఆడమ్ జంపా పెవిలియన్ పంపాడు. వీరిద్దరూ వెనుదిరిగిన తర్వాత రాజస్థాన్ విజయ అవకాశాలు తగ్గిపోయాయి.చివర్లో శిమ్రాన్ హెట్మైర్ (42) మరియు శుభమ్ దూబే (34 నాటౌట్) పోరాటం చేసినా విజయానికి చాలలేదు.రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. SRH బౌలర్లలో సిమర్జిత్ సింగ్ (2 వికెట్లు), హర్షల్ పటేల్ (2 వికెట్లు), మహ్మద్ షమీ (1 వికెట్), ఆడమ్ జంపా (1 వికెట్) కీలక వికెట్లు తీసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
మరోవైపు రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1), తాత్కాలిక సారథి రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) విఫలమయ్యారు.రాజస్థాన్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌లో చెత్త రికార్డు సృష్టించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా నిలిచాడు.ఒకదశలో SRH బ్యాటింగ్‌ను కట్టడి చేయాలని ప్రయత్నించినా, భారీ స్కోరు చేయడంతో మ్యాచ్ రాజస్థాన్ చేతిలో నిష్క్రమించిపోయింది.ఈ విజయంతో SRH తమ ఐపీఎల్ 2025 ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించడంతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఇకపై కూడా ఇదే విజయ పరంపరను కొనసాగించాలని SRH అభిమానులు ఆశిస్తున్నారు.మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ తర్వాతి మ్యాచ్‌లో గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తోంది.