సునీత కేజ్రీవాల్‌కు సీఎం పదవిపై ఆసక్తి లేదు: సౌరభ భరద్వాజ్

Sunita Kejriwal not interested in CM post: Saurabh Bhardwaj

న్యూఢిల్లీ: నేడు ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) కొత్త సీఎంను ప్రకటించనున్న నేపథ్యంలో ఆప్ నేత సౌరభ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌కు సీఎం కావాలనే ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు. నేడు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన అనంతరం సీఎంగా ఒకరి పేరును ప్రకటిస్తారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉందని సౌరభ్‌ వెల్లడించారు. పార్టీ నుంచి సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా పర్వాలేదన్నారు. ఎందుకంటే ప్రజలు కేజ్రీవాల్‌ను సీఎంగా ఎన్నుకున్నారని, ఎప్పటికైనా ఆ కుర్చీ ఆయనకే చెందుతుందని మీడియాతో జరిగిన సమావేశంలో అన్నారు.

“ఢిల్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోనని కేజ్రీవాల్‌ అన్నారు. అయితే గత ఎన్నిల్లో ప్రజల తీర్పు మేరకు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ కుర్చీ ఆయనకే చెందుతుంది. వచ్చే ఎన్నికలు జరిగే వరకు మాలో ఒకరు కుర్చీలో కూర్చుంటారు. రాముడు లేనప్పుడు(రామాయణంలో) భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో అదేవిధంగా మాలో ఒకరు దేశ రాజధానికి సీఎంగా ఉంటారు” అని సౌరభ భరద్వాజ్ పేర్కొన్నారు. కాగా, కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్‌ సతీమణి సునీత, మంత్రులు అతీశీ, గోపాల్‌రాయ్, కైలాశ్‌ గహ్లోత్, ఇమ్రాన్‌ హుస్సేన్‌ల పేర్లతో పాటు సౌరభ్‌ భరద్వాజ్ పేరు కూడా వినిపిస్తోంది.

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ డిల్లీ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం(నేడు) రాజీనామా చేయనున్నారు. ఈమేరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరగా సాయంత్రం 4.30 గంటలకు సమయం కేటాయించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్‌ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి సీఎం ఎవరనే విషయంపై స్పష్టత రానుంది.

సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ సమావేశాల్లోనే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలను నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు నిర్వహించాలని ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.