ప్రధాని మోడీకి బ్రూనై సుల్తాన్‌ ఘనస్వాగతం

Sultan of Brunei welcomes Prime Minister Modi

న్యూఢిల్లీ: బ్రూనై దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని బ్రూనై చేరుకున్నారు. భారత్‌ ప్రధాని బ్రూనై రావడం ఇదే తొలిసారి. తన పర్యటన సందర్భంగా రెండో రోజైన ఇవాళ బ్రూనై రాజు హాజీ హసనల్‌ బోల్కియాను మోడీ మీట్‌ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొందిన రాజు నివాసంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. రాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు.

కాగా, మోడీ పర్యటన నేపథ్యంలో బ్రూనై 29వ సుల్తాన్‌గా 1968లో పట్టాభిషిక్తుడైన రాజు హాజీ హసనల్‌ బోల్కియా (Haji Hassanal Bolkiah) రాజవైభోగాల గురించి విస్తృత చర్చ జరుగుతున్నది. ప్రపంచంలోని సంప‌న్న వ్యక్తుల్లో బోల్కియా ఒక‌రు. ఆయ‌న చాలా విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతారు. ఆయ‌న వ‌ద్ద అత్యధిక సంఖ్యలో ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ల‌గ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

30 బిలియన్‌ కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల టాప్‌ జాబితాలో ప్రతి ఏడాది స్థానం పొందే ఆయన లగ్జరీ వాహనాల కలెక్షన్‌లో 7,000 అత్యంత ఖరీదైన వాహనాలు ఉన్నాయి. 1979 నుంచి ఆయనకు మూడు సొంత విమానాలతో పాటు హెలికాప్టర్లు ఉన్నాయి. ఇస్తానా నూరుల్ ఇమాన్ (Istana Nurul Iman) ప్యాలెస్‌లో సుల్తాన్ బోల్కియా నివాసం ఉంటున్నారు. ఆయన నివాసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొంది గిన్నిస్‌ బుక్‌లో స్థానం పొందింది. సుమారు 20 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు ఆ ప్యాలెస్ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారంతో ఆ భ‌వంతిని దీర్చిదిద్దారు. బ్రూనే సుల్తాన్ ప్యాలెస్‌లో అయిదు స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్ రూమ్స్‌, 257 బాత్ రూమ్‌లు, 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆ సుల్తాన్‌కు ప్రైవేటు జూ కూడా ఉన్నది. దాంట్లో 30 బెంగాలీ టైగ‌ర్లు, ర‌క‌ర‌కాల ప‌క్షి జాతులు ఉన్నాయి.