కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై, ఎన్టీయేను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసాయి. కిషన్ రెడ్డికి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు అపాయింట్ మెంట్ కోరగా.. ఎలాంటి స్పందన రాకపోవటంతో విద్యార్థి సంఘాలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌, వీజేఎస్‌, వైజేఎస్‌ విద్యార్థి నాయకులు ఇయన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఎమ్మెల్సీ వెంకట్‌తోపాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నీట్ విషయంలో అక్రమాలు జరిగాయని ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడటంతో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను వెంటనే రద్దుచేసి నిజమైన విద్యార్థులకు న్యాయం చేయాలని జాతీయ స్థాయిలో ఆందోళన జరగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుంది.