నెల్లూరులో బడి గోడ కూలి విద్యార్థి మృతికి 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

నెల్లూరు నగరంలో పాఠశాల ఆవరణలోని నిర్మాణంలో ఉన్న భవనం సన్‌సైడ్‌ శ్లాబ్‌ కూలి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఫై మంత్రి లోకేశ్ సంతాపం తెలుపుతూ… విద్యార్థి కుటుంబానికి ఐదులక్షల పరిహారం ప్రకటించారు. శుక్రవారం నెల్లూరులోని బీవీనగర్ కె.ఎన్‌.ఆర్. మున్సిపల్ పాఠశాలలో నాడు-నేడు పథకం కింద నూతనంగా నిర్మిస్తున్న భవనం సన్‌సైడ్‌ శ్లాబ్‌ కూలి 9వ తరగతి విద్యార్థి గురు మహేంద్ర కన్నుమూశాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఆడుకునేందుకు భవనం వద్దకు వెళ్లిన విద్యార్థిపై శ్లాబ్‌ కూలిపడింది. ఈ ఘటన లో విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుని ధర్నా చేపట్టాయి.

విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. పురపాలక మంత్రి నారాయణ సైతం విద్యార్థి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.