కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా మృతురాలికి నివాళిగా ఓ అమ్మాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది బాధితురాలిని అగౌరపర్చేలా ఉందంటూ పలువురు నెట్టింట విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఆసిత్ సైన్ అనే శిల్పి ఈ మహిళ విగ్రహాన్ని రూపొందించారు. హత్యాచార సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను ప్రతిబింబించేలా రూపొందించిన ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్ ది అవర్’ అని పేరు పెట్టారు. దీన్ని ఇటీవల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని ప్రిన్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు. ”ఇది బాధితురాలి విగ్రహం కాదు. ఘటన సమయంలో ఆమె అనుభవించిన వేదన, హింసకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశాం” అని తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.
ఈ విగ్రహం ఏర్పాటు వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ”ఇది బాధితురాలిని అవమానించడమే. ఓ అత్యాచార బాధితురాలిని ఆధారంగా చేసుకుని ఇలాంటి విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారు? ఇది మంచి సలహా అని ఎవరు చెప్పారు? దీన్ని ఎవరు ఆమోదించారు?” అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి సెమినార్ హాల్‌లో అర్ధనగ్న స్థితిలో విగత జీవిగా కన్పించిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు పాల్పడిన సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు, ఈ ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది.