తిరుమల: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. కల్యాణ రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు , అదనపు ఈవో వెంకయ్య చౌదరి జెండా ఊపి ప్రయాగ్‌రాజ్‌కు కళ్యాణరథాన్ని పంపారు. ఈ సందర్బంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. మహా కుంభ మేళా నేపథ్యంలో యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో 2.5 ఎకరాల్లో శ్రీవారి నమూన ఆలయాన్ని ఏర్పాటు చేశామని, ఈ నెల 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు భక్తులకు స్వామి వారీ దర్శనం కల్పిస్తామని అన్నారు.

నమూనా ఆలయంలో స్వామి వారికీ నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని, జనవరి 18, 26, ఫిబ్రవరి 3,12వ తేదీల్లో శ్రీవారికీ ప్రత్యేక కళ్యాణోత్సవ సేవను నిర్వహిస్తామన్నారు. డిప్యుటేషన్‌పై 150 మంది సిబ్బందిని ప్రయాగ్‌లో నియమించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. 50 రోజులపాటు 13 వేల రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో పది వేలు రెగ్యులర్ సర్వీసులు కాగా.. మూడు వేలు ప్రత్యేక రైళ్లు. మేళా జరగడానికి 2-3 రోజుల ముందు.. ఆ తర్వాత 2-3 రోజుల వరకు రైళ్లు నడుస్తాయి. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 560 రింగ్ రైళ్లు నడుపనుంది.
ప్రయాగరాజ్-అయోధ్య-వారాణసీ-ప్రయాగ్‌రాజ్, ప్రయాగరాజ్- సంగమ్ ప్రయాగ్- జాన్‌పూర్- ప్రయాగ్- ప్రయాగరాజ్, గోవింద్‌పురి-ప్రయాగరాజ్-చిత్రకూట్-గోవింద్‌పురి, ఝాన్సీ-గోవింద్‌పురి-ప్రయాగరాజ్-మాణిక్‌పూర్-చిత్రకూట్-ఝాన్సీ మార్గాల్లో వీటిని నడుపుతారు. ప్రయాగరాజ్ ప్రాంతంలోని మొత్తం 9 రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను కూడా రైల్వే ఏర్పాటుచేస్తోంది. భక్తులు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్), రాష్ట్ర రైల్వే పోలీసుకు చెందిన 18 వేల మందికిపైగా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉత్తర మధ్య రైల్వే జీఎం ఉపేంద్ర వెల్లడించారు. ప్రయాణికులకు వైద్య సేవలు అందించడానికి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ఈసీజీ యంత్రాలతో ప్రయాగరాజ్ జంక్షన్‌లో అబ్జర్వేషన్ రూంను ఏర్పాటు చేశామన్నారు.