వికలాంగులు, కళ్లు లేని గుడ్డివారి ఇల్లులు కూల్చేశారు – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

అక్రమ నిర్మాణాల ఫై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణమని పిర్యాదు చేస్తే చాలు దర్యాప్తు చేపట్టి నేలమట్టం చేస్తుంది. మహబూబ్ నగర్‌లోని అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చేయడం పట్ల బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఎక్కువశాతం మంది కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అందరూ కళ్లులేనివారే. ప్రభుత్వం ఇచ్చే ఫించన్‌ డబ్బులే వారికి ఆసరా. ఈ ఇండ్లు ఇప్పటివి కావు. 15 సంవత్సరాల నుంచి నిరుపేదలు ఇక్కడ అవాసం ఏర్పాటు చేసుకుని కలో గంజో తాగి బతుకున్నారు.

ఈ పేదల పరిస్థితి చూసి గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్కడ రోడ్లు, మిషన్‌ భగీరథ నీళ్లు, కరెంటు మంజూరు చేసింది. ఇండ్లకు పట్టాలు కూడా ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కింద పక్కా ఇండ్లు కూడా కట్టిస్తమని చెప్పింది. ఇప్పడు రేవంత్‌ ప్రభుత్వం ఉన్న నీడను కూల్చేసిందని, వికాలంగులైన తమకు దిక్కెవరని బోరుమంటున్నారు. తాము బంజార హిల్స్‌లో కోటీశ్వరులం కాదు… వాళ్లకేమో నోటీసులు ఇస్తరు…వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటరు… మాకేందుకు ఈ అన్యాయము… ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా ప్రజాపాలన అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చివేశారన్నారు. అంధులు వేడుకున్నా కూడా పోలీసులు వారిని వదలలేదన్నారు. తమ సామాగ్రిని తీసుకుంటామని బ్రతిమిలాడినా సమయం ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం ఎక్కడైతే అంధుల ఇళ్లను కూల్చేసిందో అక్కడే వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు దీనిని సుమోటోగా స్వీకరించి.. విచారణ జరపాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.