మహిళలకు ఫ్రీ బస్సు కాదు..రక్షణ ఇవ్వండి – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి నేరాలు , దోపిడీలు , హత్యలు పెరిగిపోయాయని..ముఖ్యంగా ఆడవారికి రక్షణ అనేది లేకుండాపోయిందని బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ఆరోపిస్తూ వస్తుంది. ప్రతి రోజు ఎక్కడో చోట హత్య , గ్యాంగ్ రేప్ , నేరాల వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయిందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా దీనిపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఏం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నేరాల రేటు పెరిగితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, పర్యాటకులు ఎవరు వస్తారని అడిగారు. రాష్ట్రంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, చెప్పుకోవడానికి సిగ్గు వేస్తోందని వ్యాఖ్యానించారు. మహిళలకు ఫ్రీ బస్సు కాదు, రక్షణ, ఆత్మ గౌరవం కావాలి. రాష్ట్రంలో ప్రజలు భయపడుతూ బతికేలా పరిస్థితులు ఉన్నాయి. షాద్‌నగర్‌లో మహిళపై దాడి అతి దుర్మార్గం. యథా రాజా – తథా ప్రజ అన్నట్లు ఉంది. నేరం అంగీకరించాలని పోలీసులే దళిత మహిళను దారుణంగా హింసిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి అని ప్రశ్నించారు. అభివృద్దిపై దృష్టి సారించాలి కానీ క్షక సాధింపులు, అనవసర వేధింపులపై కాదని శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష చేయాలని, తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా చూడాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.