పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి ఒత్తిడి..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

మాదాపూర్‌లోని దుర్గంచెరువులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి ఒత్తిడి చేయడంతో అది తట్టుకోలేక యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఈ నెల 24న (బుధవారం) ఆఫీసుకు వెళ్లిన బాలాజీ అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ సైతం స్విచ్చాఫ్ చేసి ఉండడంతో స్నేహితులను విచారించారు. అయినా, ఫలితం లేకపోవడంతో ఈ నెల 25న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా.. ఈ నెల 24న రాత్రి 8:30 గంటలకు బాలాజీ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో దుర్గంచెరువు కేబుల్ మీదుగా కిందకి దిగినట్లు కనిపించడంతో గాలించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దుర్గంచెరువులో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా మృతున్ని గుర్తించారు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తోన్న బాలాజీ.. ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయగా.. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.