శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఎటు చూసినా పరిసరాలన్నీ శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తున్నది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 1 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.