ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన తన అద్భుత ప్రదర్శనతో మహిళల ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. మూడు వన్డేలు ఆడిన మంధాన, చివరి మ్యాచ్‌లో 135 పరుగులతో కదం తొక్కింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో 41, 73 పరుగులు చేయడం ద్వారా ఆమె మొత్తం 738 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో ఎదిగింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ (773 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, శ్రీలంకకు చెందిన చమారి అథపతు (733 పాయింట్లు) మూడవ స్థానంలో కొనసాగుతోంది.

జెమిమా రోడ్రిగ్స్, ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో తన తొలి సెంచరీతో రాణించి, రెండు స్థానాలు మెరుగుపరచుకుని 17వ ర్యాంక్‌లో నిలిచింది. సిరీస్‌కు దూరమైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 15వ స్థానంలో నిలిచింది. ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ 344 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీ గార్డనర్ ప్రస్తుతం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆమె దక్షిణాఫ్రికా వెటరన్ మారిజాన్ కాప్‌ను వెనక్కి నెట్టి ఈ ర్యాంక్ అందుకుంది.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సోఫీ ఎక్లెస్టోన్ ముందంజలో కొనసాగుతుండగా, దీప్తి శర్మ ఒక స్థానం మెరుగుపడి నాలుగో స్థానంలోకి చేరింది. 680 పాయింట్లతో మంచి స్థాయిలో నిలిచింది. గార్డనర్ బట్టింగ్లో మరియు బౌలింగ్ లో అదరగొడుతూ ఆస్ట్రేలియాకు విజయాలు అందించింది. హోబర్ట్‌లో ఇంగ్లాండ్‌పై 102 పరుగులతో తన తొలి వన్డే సెంచరీ సాధించింది. తద్వారా, ఆమె వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమమైన 469 రేటింగ్ పాయింట్లకు చేరుకుంది. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా గార్డనర్ ఐదు స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకుంది.