సిరిసిల్లలో కుంగిన రోడ్డు..రాకపోకలు బంద్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురిసాయి.. ఈ వర్షాలకు జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. నిన్నటి నుండి వరుణుడు శాంతించడం తో హమ్మయ్య అనుకుంటున్నారు. ఇక సిరిసిల్ల నగరం వర్షాలకు అతలాకుతలమైంది. ఇళ్లల్లోకి నీరు చేరడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలో తమ సామాగ్రి అంతే కొట్టుకుపోయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని వాపోతున్నారు.

ఇదిలా ఉంటె కొత్త చెరువు దగ్గర రహదారి కుంగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. మినీ ట్యంక్ బండ్‌గా అభివృద్ధి చేసిన కొత్త చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో మత్తడి దూకుతోంది. సిరిసిల్ల-కరీంనగర్ రహదారి జలమయం అయింది. రహదారిపై నుంచి నీరు త్వరగా వెళ్లేందుకు అధికారులు డివైడర్‌ను తొలగించారు. దీంతో రోడ్డు ఓ వైపు కుంగిపోవడంతో ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఒక్క సిరిసిల్ల లోనే కాదు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వర్షాలు, వరదలకు ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. గత 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది.