నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ..

నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు.. ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా తరలిరానున్నారు భక్తులు..సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది స్వామివారి రథం.. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించు కోవడం భక్తుల్లో అనవాయితీగా వస్తుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం.

కాగా, ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. ఇక, గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు, రేపు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. జులై 20న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి, రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం.. రాత్రి 10 గంటలకు వరకు దర్శనాలకు అనుమతించనున్నారు. ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు 2,600 మంది పోలీసు సిబ్బంది.. మరోవైపు.. గిరిప్రదక్షిణ కారణంగా ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని.. భక్తులు, ప్రజలు అగమనించాలని సూచించారు అధికారులు.. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు.. అయితే, సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలు పెట్టాల్సి ఉంటుంది.. తొలిపావంచ నుంచి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక పోలీసు క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్‌బీ కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీ నగర్, బుచ్చిరాజు పాలెం, లక్ష్మీ నగర్, ఇందిరా నగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, లి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేసుకోవాల్సి ఉంటుంది.