టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన శైలిలో నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన గుర్తింపు వల్ల తనకు పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అనే అరుదైన మానసిక వ్యాధి వచ్చిందని, దానిని అధిగమించడానికి ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ తన కెరీర్ ప్రారంభంలోనే పెద్ద విజయాలు అందుకున్నారు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రంగ్ దే బసంతీ వంటి చిత్రాలు ఆయనకు భారీ క్రేజ్ తీసుకువచ్చాయి. అయితే ఈ ఫేమ్ కారణంగా జనాలు తనపై చూపిన అటెన్షన్ తనను మానసికంగా ఒత్తిడికి గురిచేసిందని, లైమ్‌లైట్‌లో ఉండటం తాను అంతగా ఆస్వాదించలేకపోయానని తెలిపారు.

తన భార్య, నటి అదితి రావు హైదరి లైమ్‌లైట్‌ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని, కానీ తాను మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పారు. “స్టార్ అయ్యాక జనాలు వచ్చి నాతో మాట్లాడినప్పుడు, నా అటెన్షన్ కోసం పోటీపడినప్పుడు, నా మానసిక స్థితిపై దాని ప్రభావం పడింది” అని తెలిపారు. జనాల దృష్టిని తట్టుకునేందుకు, సామాజికంగా మెరుగవ్వడానికి ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టిందని వెల్లడించారు. “స్టార్‌డమ్ దక్కడం గర్వించే విషయం, కానీ ప్రతి ఒక్కరికీ దాన్ని నిర్వహించగల శక్తి ఉండాలని కాదు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అందుకే నేను నా అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నా” అంటూ మానసిక ఆరోగ్యంపై తనదైన స్పష్టతను తెలియజేశారు. “నన్ను ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం కృతజ్ఞతగా ఉండాలని చాలామంది చెబుతారు, కానీ నా మనసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది” అని చెప్పుకొచ్చారు.
సిద్ధార్థ్ 2003లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరీర్ ప్రారంభంలో పెద్ద విజయాలు అందుకున్నా, వాటి ప్రభావం తన వ్యక్తిగత జీవితంపై తీవ్రంగా పడిందని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలా కష్టపడ్డానని, కానీ ఇప్పుడిప్పుడే సాధారణ జీవితం గడపడం ఎలా అనుభూతిపరచాలో నేర్చుకున్నానని తెలిపారు. స్టార్‌డమ్ వెనుక ఉండే ఒత్తిడిని, మానసిక ఆరోగ్యాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా సినీ పరిశ్రమ వారికి, అభిమానులకు సందేశం ఇచ్చారు.