Siddaramaiah : హనీ ట్రాప్ వ్యవహారం అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ.. స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం అయితే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం
తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని.. చట్టప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి.పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. దీంతో 15 నిమిషాల పాటు సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదు
తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని పేర్కొన్నారు.