బెజవాడలోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థ రావాల్సిందేనా..?

విజయవాడలో ముంపునకు కారణమైన ‘బుడమేరు’ మైలవరం కొండల్లో పుట్టింది. ఆరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలవుతుంది. కొల్లేరు సరస్సుకు నీటిని సరఫరా చేస్తుంది. దీనిలో ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో నీళ్లుంటాయి. సాధారణంగా ఏటా గరిష్ఠంగా 10,000-11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తుంది. ఇది చాలా మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుండడంతో ఎక్కువ ప్రవాహం వస్తే నీరు గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంది.

బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెజవాడ నీటమునిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్యతరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. క్రమక్రమంగా అవి పెద్దపెద్ద కాలనీలుగా విస్తరించాయి. దీంతో ఇక్కడా హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బుడమేరు వాగుకు 2005లో 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో విజయవాడ మునిగింది. దీంతో దాన్ని పోలవరం కుడికాలువకు లింక్ చేసి, రెగ్యు లేటర్ ఏర్పాటు చేశారు. తద్వారా బుడమేరుకు ప్రవాహం తగ్గడంతో ఆక్రమణదారులు గద్దల్లా వాలారు. ఆ వాగు కనిపించకుండా కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. తాజాగా ప్రకాశం బ్యారేజీలో భారీ ప్రవాహం ఉండటంతో కుడికాలువ నీటిని పైకి ఎగదోసింది. దీంతో బుడమేరుకు నీటిని వదలడంతో బెజవాడ ‘జలవాడ’ అయింది.