ఏపీ రైతుల కష్టాలను స్వయంగా చూశాను: శివరాజ్ సింగ్ చౌహాన్

shivraj-singh-chouhan-visits-flood-hit-areas-in-ap

అమరావతి: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈరోజు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో క్రేతస్థాయిలో పర్యటించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, తాను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతులు ఎలా కష్టపడతారో తనకు తెలుసని వెల్లడించారు. ఇక్కడ వారం రోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయని తెలిపారు. వరి, మొక్కజొన్న, అరటి, కంద వంటి పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించానని వివరించారు.

నాలుగైదు రోజుల్లో వరి పంట చేతికొచ్చేదని, కానీ రోజుల తరబడి పొలాల్లో నీరు నిలవడంతో పంట కుళ్లిపోయిందని అన్నారు. ఈ వరదలు కౌలు రౌతులకు మరింత నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. పంట నష్టం వచ్చినా కౌలు రౌతులు కౌలు చెల్లించాలని, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇవాళ స్వయంగా చూశానని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన పంట నష్టం వివరాలను కేంద్రానికి తెలియజేస్తానని, తద్వారా రైతులకు సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు కూడా ఇస్తామని తెలిపారు.